Bhakthi TV

9th October 2025
అట్ల తద్దియ :
అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు పావడాలు కట్టిన పల్లె పడుచులు. తమ ఆశలు ప్రతిఫలించేలా, నవవధువులు ముత్తైదు భాగ్యాలు సిద్ధించేలా, కరచరణాలకు నఖరంజని ధరిస్తారు. తెలుగు లోగిళ్లకు, తోటలకు సరికొత్త అందాలు తెస్తారు. ఆధ్యాత్మిక శోభకు పట్టం కడతారు. కన్నెలు, నవవధువులు చేసే సరదాల సందళ్లు చూసే కన్నులు వెలుగులై, మనసు ముగ్ధమయ్యే కమనీయ రమణీయ పర్వం అట్లతద్ది. అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడో రోజు వస్తుంది. పెళ్లైన స్త్రీలు ఐదవతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం అట్లతద్ది నోము నోచుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. అట్లతద్ది రోజున తెల్లవారు జామునే లేచి, స్నానాలు చేసి చద్దిభోజనం చేస్తారు. పగలంతా భోజనం చేయరు. పగలంతా తోటలవెంట చెలులతో ఆట పాటలతో గడిపి సాయంవేళకు ఇళ్లకు చేరుకుంటారు. పొద్దువాలిన తరువాత పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. పూజగదిలో కలశం ప్రతిష్టించి గౌరీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. పూజలో తులసీదళం, తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్లు వేసి చేతులకు తోరాలు కట్టుకుంటారు. అనంతరం అట్లతద్ది కథ చదువుకుంటారు. కథ పూర్తైన తర్వాత అమ్మవారికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తైదువులకు ఒకొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, గౌరీ దేవికి నివేదించిన కుడుముల్లోనుంచి ఒకటి ఉంచిన తాంబూలంతో వాయనం ఇస్తారు. ఆ తర్వాత చంద్రుణ్ణి దర్శించుకుంటారు. తరువాత అట్లు ఆరగించి ఉపవాసం విరమిస్తారు.

4 days ago | [YT] | 814